GOVT/POLITICS

ఆదిలాబాద్ అభివృద్ధికి భారీ ప్రణాళికలు: సీఎం రేవంత్ రెడ్డి

by udhayatoday  •  April 7, 2026

తెలంగాణ అభివృద్ధి విషయంలో నియోజకవర్గాల పట్ల తారతమ్యం లేకుండా, ఎవరి పట్ల వివక్ష చూపించకుండా రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలను చేపడుతున్నామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో అధికార, ప్రతిపక్ష నియోజకవర్గాల తేడా లేకుండా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని వివరించారు.

✳️ ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.

- Advertisement -Advertisement

✳️ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోయినా, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామంటూ, అందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఉటంకించారు.

✳️ “రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. ఎక్కడా పార్టీలను చూడలేదు. ఆడబిడ్డల కష్టాలను మాత్రమే చూశాం” అని అన్నారు.

✳️ 2034 నాటికి ఆదిలాబాద్ జిల్లా అత్యంత అభివృద్ధి చెందిన పారిశ్రామిక వాడగా, పర్యాటక ప్రాంతంగా, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామంటూ సమీప భవిష్యత్తులో జిల్లాలో చేపట్టబోయే అభివృద్ధి లక్ష్యాలను వివరించారు.

✳️ “ఆదిలాబాద్ జిల్లాలో అపారమైన ఖనిజ సంపద ఉన్నప్పటికీ ప్రభుత్వాలు సరైన ప్రణాళికలు చేయకపోవడం వల్ల వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది. జిల్లాలో అపారమైన జలవనరులు, అపారమైన ప్రాచీన సంస్కృతి ఉంది. అయినప్పటికీ వ్యవసాయం విస్తరించలేదు. విద్య, వైద్యం అందలేదు. తాగడానికి నీళ్లు అందని పరిస్థితి..” అని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -Advertisement

✳️ “ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేయడానికి పార్టీలకు అతీతంగా అందరు నాయకులతో మాట్లాడాం. గతంలో ఇలా మాట్లాడే సంస్కృతి లేదు. ఇక్కడి ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జిల్లా ఇంచార్జి మంత్రి గారు అవసరమైన చర్యలు తీసుకుంటారు.

✳️ 2027 మార్చి 31 వరకు గ్రామ, మండల, జిల్లా కేంద్రాల సరిహద్దులను మార్చడానికి వీలులేదని కేంద్ర ప్రభుత్వం కట్టడి విధించింది. అందువల్ల సరిహద్దు సమస్యలకు సంబంధించి జిల్లా ప్రజాప్రతినిధులు చెప్పిన అంశాలను కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు తర్వాత ప్రత్యేకంగా జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసి పరిశీలిస్తాం” అని చెప్పారు.

✳️ “ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే పనులు జరుగుతున్నాయి. ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఆదిలాబాద్‌కు తాగు, సాగునీటి సమస్యను పరిష్కరిస్తామని” హామీ ఇచ్చారు. ✳️ “వీలైతే వచ్చే జూన్ 2 లోపు ఆదిలాబాద్‌లో తలపెట్టిన విమానాశ్రయం శిలాఫలకం వేసే బాధ్యత తీసుకుంటాం. ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసే విషయంలో ఇప్పటికే ప్రధానమంత్రి గారితో, కేంద్ర రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖల మంత్రులతో మాట్లాడాం.

✳️ ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక కేంద్రంగానే కాకుండా, దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను మంజూరు చేసి ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పనులు కొనసాగుతున్నాయి. అందుకు సంబంధించి తొందర్లోనే నిర్ణయం తీసుకోబోతున్నాం.

- Advertisement -Advertisement

✳️ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ లేని లోటును భర్తీ చేయడానికి అందుకు అవసరమైన భూ సేకరణ తదితర విషయాలపై తొందర్లోనే నిర్ణయం తీసుకోవడమే కాకుండా ప్రారంభోత్సవానికి వస్తా. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి వచ్చే బాసర సరస్వతి అమ్మవారి ఆలయం విస్తరించాల్సిన అవసరం ఉంది. అందుకే 225 కోట్ల రూపాయలు మంజూరు చేసి అభివృద్ధి పనులు ప్రారంభించాం.

✳️ దేశంలోనే ఒక గొప్ప ఆలయంగా బాసరను తీర్చిదిద్దడానికి అవసరమైతే అదనంగా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దీంతో పాటు గూడెంలోని సత్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. వచ్చే గోదావరి పుష్కరాల కోసం ఆలయాల అభివృద్ధి కార్యాచరణలో మొట్టమొదటి ప్రాధాన్యతతో నిధులు మంజూరు చేసి సత్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం” అభివృద్ధి ప్రణాళికలను వివరించారు.

✳️ “ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎంత చేసినా తక్కువే. చేయకుండా వదిలేసే ప్రసక్తే లేదు. ప్రతి రెండు నెలలకు ఒకసారి వస్తూనే ఉంటా. వచ్చిన ప్రతిసారీ నిధులు తెస్తూనే ఉంటా. పోరాటాలకు నిలయమైన ఈ జిల్లాను స్ఫూర్తిగా ఎంచుకున్నాం.

✳️ పేదవాడి కళ్లల్లో ఆనందం చూడాలి. మేం పాలకులం కాదు. ప్రజలకు సేవకులం. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరి సహకారం కావాలి” అని ముఖ్యమంత్రి గారు కోరారు.

- Advertisement -Advertisement

✳️ ఎన్నికలకు ముందు భట్టి విక్రమార్క గారు పీపుల్స్ మార్చ్ పాదయాత్రను పిప్రి నుంచే ప్రారంభించిన దానికి గుర్తుగా ఇక్కడ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు.

✳️ అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 30,149 స్వయం సహాయక సంఘాలకు 53.50 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. ఉత్తమ సేవలు అందించిన 4 సర్పంచులకు ఐఎస్ఓ సర్టిఫికేట్లను, సీఎం కప్ ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించిన విజేతలకు కప్‌ను అందించారు.

DISCLAIMER: Some news articles and content published on this website are translated, rewritten, or generated with the assistance of Artificial Intelligence (AI) tools. While every effort is made to ensure accuracy and quality, occasional grammatical errors, typographical mistakes, translation inaccuracies, or other unintended issues may occur. Such errors are purely unintentional, and the website administration shall not be held responsible for them. Readers are kindly requested to disregard any such mistakes if noticed. We sincerely thank our readers for their continued support and encourage everyone to share our news and updates with others.